Tuesday 29 October 2013

కేసీఆర్ విశ్వసించగల స్నేహితుడు కాదని కాంగ్రెస్, బి.జె.పి. నేతలు అంటుంటారు – వేమూరి రాధాకృష్ణ

కేసీఆర్ విశ్వసించగల స్నేహితుడు కాదని కాంగ్రెస్, బి.జె.పి. నేతలు అంటుంటారు – వేమూరి రాధాకృష్ణ

ఇంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని ఎదిరిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇప్పుడు ఏకంగా భారత ప్రభుత్వం వ్యవహారశైలినే ప్రశ్నిస్తూ లేఖాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఆక్షేపిస్తూ ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు లేఖలు రాయడం గతంలో ఎన్నో సందర్భాలలో జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతున్నది. అయితే, సొంత పార్టీ ప్రభుత్వాన్నే నిందిస్తూ ఒక ముఖ్యమంత్రి ధిక్కార స్వరం వినిపించడం మాత్రం ఇప్పుడే జరిగింది. రాష్ట్ర విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అనుసరిస్తున్న వ్యవహార శైలి కాంగ్రెస్ అధిష్ఠానానికి మింగుడు పడటంలేదు. ముఖ్యమంత్రి స్థానంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ఉంటే విభజన ప్రక్రియ సాఫీగా జరగదన్న అనుమానం పార్టీ పెద్దలను పట్టి పీడిస్తున్నది. దీంతో విభజనకు సంబంధించిన తీర్మానాన్ని శాసనసభకు పంపించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కాంగ్రెస్ పెద్దలు అన్వేషిస్తున్నారు. 1396546_212972712208739_1790607656_nఅధిష్ఠానం ఆలోచనలను గమనించిన ముఖ్యమంత్రి, విభజన విషయంలో గతంలో అనుసరించిన సంప్రదాయాలను పాటించాలని కోరుతూ రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖలు రాయడం ద్వారా కాంగ్రెస్ పెద్దల ముందరి కాళ్లకు బంధం వేశారు.
మొత్తంమీద అటు కాంగ్రెస్ అధిష్ఠానం, ఇటు ముఖ్యమంత్రి కూడా విభజన విషయంలో దుందుడుకుగా వ్యవహరించడంతో తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు పెచ్చరిల్లే ప్రమాదం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ధిక్కరించడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తప్పించడం ఎలా అన్న అంశంపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించారు. అవకాశం చిక్కితే తనను తప్పిస్తారని తెలిసే కిరణ్ కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగుల సమ్మె వల్ల పాలనా యంత్రాంగం స్తంభించడంతో, దాన్ని సాకుగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని తెలుసుకున్న ముఖ్యమంత్రి, ఉద్యోగులతో మాట్లాడి సమ్మె విరమింపజేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసింది. ఇప్పుడు మూడు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన గవర్నర్ నరసింహన్, వివిధ నివేదికలతో అటు ప్రభుత్వ పెద్దలను, ఇటు పార్టీ పెద్దలను కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. దీంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖాస్త్రాలు సంధించారు.
కాంగ్రెస్ అధిష్ఠానానికి, ముఖ్యమంత్రికి మధ్య ఇప్పటివరకు దోబూచులాటకే పరిమితమైన విభజన వివాదం ఇప్పుడు బహిర్గతమైంది. తాజాగా సంధించిన లేఖాస్త్రాలతో ముఖ్యమంత్రి రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారారు. తెలంగాణవాదులకు ఆయన విలన్‌గా కనిపిస్తుండగా, సమైక్యవాదులకు ఆయన హీరోగా కనబడుతున్నారు. సమైక్యవాదం పేరిట జగన్మోహన్‌రెడ్డి, సమన్యాయం పేరిట చంద్రబాబునాయుడు సీమాంధ్రలో రాజకీయ ప్రయోజనం పొందాలని భావిస్తుండగా, విభజనకు వ్యతిరేకంగా దూకుడుగా వ్యవహరించడం ద్వారా ముఖ్యమంత్రి ఈ రేసులో ముందంజలో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి సొంత పార్టీ పెద్దలను ధిక్కరిస్తూ వ్యవహరించడం ప్రజలకు సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తుంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఆశీస్సులతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి ధిక్కార స్వరం వినిపిస్తున్నారని కొంతమంది అనుమానిస్తున్నారు. అయితే అధిష్ఠానంతో అమీతుమీ తేల్చుకోవడానికే ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారని తాజా వ్యవహారంతో స్పష్టమవుతోంది.
విభజన తీర్మానం అసెంబ్లీకి వస్తే దాన్ని ఓడించడం ద్వారా విభజన విషయంలో ముందుకు వెళ్లలేని పరిస్థితి కల్పించాలని కిరణ్ తొలుత భావించారు. ఆయన ఈ ఆలోచన చేస్తున్నారని తెలిసే, తీర్మానం బదులు ఏకంగా ముసాయిదా బిల్లునే అసెంబ్లీకి పంపాలన్న నిర్ణయానికి ఢిల్లీ పెద్దలు వచ్చారు. దీంతో సంప్రదాయాలను పాటించరా? అంటూ రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని ఇరకాటంలోకి నెట్టడానికి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారా? లేదా? అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. వాస్తవానికి ముఖ్యమంత్రి పదవి నుంచి కిరణ్‌ను తప్పించాలన్న ఆలోచనకు కాంగ్రెస్ అధిష్ఠానం వచ్చింది. అయితే ఆ పనిచేయడం వల్ల ఎదురయ్యే పరిణామాలను ఊహించుకుని జంకుతోంది. తదుపరి ముఖ్యమంత్రిని చేస్తామంటూ ఒకరిద్దరు మంత్రులకు ఆశ చూపడం ద్వారా సీమాంధ్రకు చెందిన మంత్రులు, శాసనసభ్యులను ముఖ్యమంత్రి నుంచి దూరం చేయడానికి కాంగ్రెస్ పెద్దలు చేయని ప్రయత్నం లేదు.
గురువారం నాడు రాష్ట్రపతిని కలిసిన సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందంలో ఎక్కువ మంది పాల్గొనకుండా కట్టడి చేయగలిగారు. ఇందుకోసం పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావులను అధిష్ఠానం పెద్దలు ఉపయోగించుకున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. శాసనసభలో విభజనకు సహకరిస్తే ముఖ్యమంత్రిని చేస్తామని ఆనం రామనారాయణరెడ్డికి ఆశ చూపారని, 2014 ఎన్నికలలో ఓడిపోయినా, వేరే రాష్ట్రం నుంచైనా రాజ్యసభకు పంపుతామని బొత్స సత్యనారాయణకు హామీ ఇచ్చారని కూడా చెబుతున్నారు. ముందుగా ముఖ్యమంత్రిని బలహీనపర్చడం ద్వారా విభజన వ్యవహారాన్ని సాఫీగా పూర్తిచేసుకోవాలన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచనగా ఉంది. అధిష్ఠానంతో ఎలాగూ విభేదాలు వచ్చాయి కనుక ప్రజలలోనైనా హీరో అనిపించుకోవాలని, ఆ క్రమంలో సొంత పార్టీ పెట్టుకుని వచ్చే ఎన్నికలలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు.
సొంత పార్టీ పెట్టే విషయంలో ముఖ్యమంత్రికి స్పష్టత వచ్చిందని చెబుతున్నారు. ఫైలిన్ తుఫాను బాధితులను పరామర్శించడానికి శ్రీకాకుళం వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడ మాట్లాడుతూ, బాధితులకు 50 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సాయం ప్రకటించారు. అయినా ప్రజలనుంచి చప్పట్లు రాలేదు. అదే సమయంలో ఫైలిన్ తుఫానును ఆపలేకపోయినా రాష్ట్ర విభజన తుఫానును ఆపుతానని ముఖ్యమంత్రి ప్రకటించడంతో సభకు వచ్చిన వారంతా చప్పట్లు కొట్టారు. దీంతో సమైక్యవాదం ఎజెండాగా సొంత పార్టీ పెట్టుకుంటే ప్రజలు ఆదరిస్తారన్న విశ్వాసం ముఖ్యమంత్రిలో ఏర్పడింది. ఏపీఎన్‌జీవోల మద్దతు తనకే ఉన్నందున, కేంద్ర ప్రభుత్వాన్ని బహిరంగంగా ఎదిరించడం ద్వారా విభజన ప్రక్రియను జాప్యం చేయగలిగితే సీమాంధ్రలో మిగతా ఇద్దరు ప్రత్యర్థుల కంటే తానే బలంగా ఉంటానన్న అభిప్రాయానికి కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చారు.
2014 ఎన్నికలలోపు విభజన ప్రక్రియ పూర్తయ్యి రెండు రాష్ట్రాలు ఏర్పడితే సమైక్యవాదం జపించినా ఉపయోగం ఉండదన్న ఉద్దేశంతో, ఎన్నికల వరకు ఏదో ఒక విధంగా విభజనను అడ్డుకోవాలన్న నిర్ణయానికి ఆయన వచ్చారు. శాసనసభలో విభజన తీర్మానం ఆమోదం పొందకుండా ఇంతవరకు ఎక్కడా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయలేదు. తీర్మానం వీగిపోతే విభజన బిల్లును ఆమోదించడానికి రాష్ట్రపతి సిద్ధంగా లేరన్న సంకేతాలు రావడంతో, తీర్మానం పంపకుండా విభజన ఎలా చేస్తారని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు.
- ప్రమాదకర క్రీడ!
అటు కాంగ్రెస్ అధిష్ఠానానికి, ఇటు ముఖ్యమంత్రికి మధ్య సాగుతున్న ఈ ఆటలో ఎవరు దోషులంటే ఇద్దరూ అని చెప్పవలసి ఉంటుంది. సొంత పార్టీ ముఖ్యమంత్రికి నచ్చజెప్పకుండా విభజన వైపు వడివడిగా అడుగులు వేయాలని కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నించడం సరైనది కాదు. అదే సమయంలో తెలంగాణ విషయంలో అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బహిరంగంగా ప్రకటించిన ముఖ్యమంత్రి, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం కూడా సమర్థనీయం కాదు. అయితే రాష్ట్రాన్ని విభజిస్తే ఎన్నో సమస్యలు వస్తాయని పార్టీ పెద్దలకు చెప్పినా పట్టించుకోలేదు కనుకే తాను ఈ విధంగా వ్యవహరించవలసి వస్తోందని కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు. పార్టీ నిర్ణయంతో విభేదించే పక్షంలో రాజీనామా చేయాలి కానీ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ విభజనకు ఆటంకాలు కలిగించడం ఏమిటని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మామూలు సందర్భంలో అయితే ముఖ్యమంత్రి చేస్తున్నది తప్పు అని అధికులు భావించేవాళ్లు. అయితే ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశం కనుక, పార్టీ అధిష్ఠానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి ధిక్కరిస్తున్నా, ఒక ప్రాంత ప్రజలలో ఆయనకు మద్దతు లభిస్తున్నది.
ఈ తప్పొప్పుల విషయం అటుంచితే అధిష్ఠానానికి, ముఖ్యమంత్రికి మధ్య సాగుతున్న ఈ క్రీడ వల్ల విభజన అంశం మరింత సంక్లిష్టం అవ్వడంతో పాటు ప్రజల మధ్య విద్వేషాలు చోటుచేసుకునే ప్రమాదం ముంచుకొస్తోంది. వాస్తవం చెప్పాలంటే విభజన ప్రక్రియను సాఫీగా, ప్రశాంత పరిస్థితులలో పూర్తిచేయవచ్చు. కాంగ్రెస్ అధిష్ఠానం ఏకపక్షంగా దుందుడుకుగా వ్యవహరిస్తున్నదన్న అభిప్రాయం సీమాంధ్ర ప్రజలలో ఏర్పడింది. అందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులే కారణం. ప్రజలలో నెలకొన్న ఈ అభిప్రాయాన్నే అస్త్రంగా మలచి పార్టీ అధిష్ఠానంపై ముఖ్యమంత్రి సంధించారు. విభజనకు సంబంధించి దిగ్విజయ్‌సింగ్ నిత్యం చేస్తున్న ప్రకటనలతో సీమాంధ్రులకు చిర్రెత్తుకొస్తోంది. హైదరాబాద్‌పై మరో మాట లేదు. మీకు ఏమి కావాలో అడగండి అని అంటూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవడం సీమాంధ్రులను బాధిస్తున్నది. తమను అలక్ష్యం చేయడంతోపాటు, తమ మనోభావాలను ఖాతరు చేయకుండా కేంద్రం ముందుకు వెళ్లడాన్ని సీమాంధ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో సామాన్య ప్రజలే కాదు పేరు మోసిన వ్యాపారవేత్తలు కూడా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. “విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరడం లేదు. తీసుకోగలరన్న నమ్మకం కూడా లేదు. అయితే విభజన పూర్తిచేసే లోపు సీమాంధ్ర ప్రజలకు భరోసా కల్పించడానికి ఏ చర్యలు తీసుకుంటారో చెప్పకుండా ముందుకు వెళ్లడం ఏమిటి? కేంద్రం ఎందుకింత మొండిగా వ్యవహరిస్తున్నదో తెలియడం లేదు” అని ఒక బడా పారిశ్రామికవేత్త వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో శాంతిభద్రతలు, రెవెన్యూ వంటి అంశాలను గవర్నర్ పరిధిలో ఉంచాలన్న అభిప్రాయంతో కేంద్రం ఉన్నట్టు చెబుతున్నారు. అలా చేయాలనుకున్నా, తెలంగాణకు చెందిన రాజకీయ పార్టీల నాయకులతో చర్చించి ఒప్పించాలి కదా? తెలంగాణ ఏర్పడుతున్న ఆనందం తెలంగాణవాదులలో ఉండవచ్చు గానీ, భవిష్యత్తులో ఉభయ రాష్ట్రాల మధ్య విభేదాలు ఏర్పడితే తెలంగాణ ప్రజలు కూడా నష్టపోతారు. “మేం ప్రజలకు జవాబుదారీ కాదు. రాజకీయ పార్టీలకు అంతకంటే కాదు. రాష్ట్రాన్ని విభజించడానికి మాకు అధికారం ఉంది. ఇష్టం వచ్చినట్టు చేస్తాం” అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీమాంధ్ర ప్రజలు, రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంలో జరుగుతున్నది కూడా అలాగే ఉంది. ఉభయ ప్రాంతాల ప్రజలు, నాయకుల మధ్య సామరస్య వాతావరణం ఏర్పరచకుండా రాష్ట్రాన్ని విభజిస్తే తెలుగు ప్రజలు భవిష్యత్తులో పలు ఇబ్బందులు పడతారు. “అన్ని సమస్యలూ పరిష్కరిస్తాం. సీమాంధ్రకు న్యాయం చేస్తాం” అని చెబుతున్న ఢిల్లీ పెద్దలు, అవి ఎలా చేస్తారో మాత్రం చెప్పడం లేదు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాలకు సంబంధించిన బిల్లులను పరిశీలిస్తే వివాదాస్పద అంశాలకు ఎక్కడా పరిష్కారం చూపలేదు. ఏకాభిప్రాయంతో విడిపోయిన ఆ రాష్ట్రాలకు వాటి మాతృ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, బీహార్‌ల మధ్య వివాదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
“వివాదాలను మీరే పరిష్కరించుకోండి. కుదరకపోతే మా దగ్గరకు రండి” అని కేంద్ర ప్రభుత్వం ఆయా బిల్లులలో పేర్కొంది. అదే తరహాలో తెలంగాణ బిల్లును కూడా రూపొందిస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న! మన రాష్ట్రంలో విభజన విషయంలో ఉభయ ప్రాంతాల నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకే పార్టీకి చెందిన వారు కూడా పరస్పరం పలకరించుకోని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులలో ఆయా సమస్యలకు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపకుండా మీరే పరిష్కరించుకోండి అని బిల్లులో పేర్కొంటే మాత్రం తెలుగు ప్రజలకు తీరని అన్యాయం చేసినవారు అవుతారు. కాగా, ఏ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందో ఆ ప్రయోజనం కూడా తెలంగాణలో సిద్ధించేలా లేదు. ఎందుకంటే తెలంగాణ సాధకుడిగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే క్రెడిట్ కొట్టేశారు. తెలంగాణ తెచ్చింది తామేనని కాంగ్రెస్‌వాదులు చెప్పుకొంటున్నా ప్రజలలో అంతగా స్పందన కానరావడం లేదు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జైత్రయాత్ర పేరిట కాంగ్రెస్ నిర్వహించిన సభకు ప్రజలు పలచగా హాజరయ్యారు. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా పునరాలోచనలో పడ్డారు.
కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వల్ల రాజకీయంగా నష్టపోతాం అన్న అభిప్రాయానికి ఆ పార్టీ నాయకులు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి పలువురు నాయకులతో పచ్చగా కళకళలాడుతున్నదంటే తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండటమే కారణం. సెంటిమెంట్ ఆసరాగా ఎన్నికల్లో గెలవడం ఈజీ అన్న ఉద్దేశంతోనే వివిధ పార్టీల నాయకులు టి.ఆర్.ఎస్.లో చేరారు. తెలంగాణ ఏర్పాటును ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోకపోవడంతో విలీనానికి ఇప్పుడేమీ తొందరలేదు అని కె.సి.ఆర్. కూడా ప్రకటించారు. విలీనం అంశం తర్వాత చూద్దాం అని ఆయన అంటున్నారు. ఏదో ఒక వంకతో విలీనాన్ని తప్పించుకోవాలన్న అభిప్రాయంతో కె.సి.ఆర్. ఉన్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో టి.ఆర్.ఎస్. ప్రభుత్వం మాత్రమే ఏర్పడాలని, రాష్ట్ర పునర్నిర్మాణంలో తమ పార్టీనే కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులకు దిక్కుతోచడం లేదు. విలీనం విషయంలో కె.సి.ఆర్. యూ టర్న్ తీసుకుంటే పరిస్థితి ఏమిటని తెలంగాణ కాంగ్రెస్ నాయకులే కాకుండా, ఢిల్లీ పెద్దలు కూడా కలవరం చెందుతున్నారు. బహుశా ఈ కారణంగానే కాబోలు “తెలంగాణ తెచ్చింది మేమే” అంటూ జిల్లాలలో ప్రచారం చేసి రాజకీయంగా బలపడటానికి కృషి చేయవలసిందిగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు దిగ్విజయ్‌సింగ్ ఫోన్‌లు చేసి మరీ చెబుతున్నారు.
టి.ఆర్.ఎస్. విలీనం జరగకపోయినా, కనీసం ఎన్నికలలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రయోజనం సిద్ధించే పరిస్థితులు కనిపించడం లేదు. విభజన వల్ల తెలంగాణలో కూడా రాజకీయ ప్రయోజనం చేకూరదని ముఖ్యమంత్రి కిరణ్ మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో పరిస్థితులు అలాగే ఉన్నాయి. రాజకీయాలలో కె.సి.ఆర్. విశ్వసించగల స్నేహితుడు కాదని కాంగ్రెస్, బి.జె.పి.లకు చెందిన జాతీయ నాయకులు అంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారంనాడు కె.సి.ఆర్. చేసిన ప్రకటనలు కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడటం లేదు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు మాత్రం ఏదో ఒక విధంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో తెలంగాణ బిల్లుకు ఆమోదం పొందాలన్న ఆలోచనతో ఉన్నారు. ఒకసారి బిల్లు ఆమోదం పొందితే పరిస్థితులు మారిపోతాయని వారు అంచనా వేస్తున్నారు. బిల్లు రూపకల్పనకు, ఆమోదం పొందడానికి వ్యవధి ఎక్కువగా లేనందునే తెలంగాణవాదులు, సమైక్యవాదులు వ్యూహ ప్రతివ్యూహాలతో అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ప్రదర్శిస్తున్న వేగిరపాటును తటస్థవాదులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఉభయ ప్రాంతాలకు చెందిన వారిని కూర్చోబెట్టి సర్దిచెప్పవలసిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నదో ఎవరికీ అంతుపట్టడం లేదు.
రాష్ట్రంలో సామరస్య వాతావరణం ఏర్పరచకుండా విభజన చేస్తే ఉభయ ర్రాష్టాల మధ్య దాయాదుల పోరుకు అంకురార్పణ చేసినవారవుతారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నందున సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులను ఆ పార్టీ అధిష్ఠానం విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. ఈ కారణంగానే రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఢిల్లీలో హల్‌చల్ సృష్టిస్తున్నారు. గవర్నర్‌గా ఉన్న ఆయన కాంగ్రెస్ నాయకులను కూడా కలిసి చర్చోపచర్చలు జరిపారు. ఢిల్లీలో ఆయన ఏ నివేదికలు ఇచ్చారో, ఎవరితో ఏమి చర్చించారో ఎవరికీ తెలియదు. రాష్ట్రంలో పరిస్థితులు బాగా లేవనీ, వీలైనంత త్వరగా విభజన ప్రక్రియ పూర్తిచేయకపోతే పరిస్థితులు మరింత విషమిస్తాయని గవర్నర్ ఢిల్లీ పెద్దలకు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రిపైన కూడా ఆయన ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. నిజం చెప్పాలంటే ముఖ్యమంత్రిపై గవర్నర్ ప్రత్యేకంగా ఫిర్యాదు చేయవలసిన పనిలేదు. కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ముఖ్యమంత్రిపై గుర్రుగా ఉంది. విభజన బిల్లును శాసనసభకు పంపేలోపు ముఖ్యమంత్రిని మార్చాలన్న ఆలోచన కూడా కాంగ్రెస్ పెద్దలు చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో అది సాధ్యమా అని తటపటాయిస్తున్నారు.
మరోవైపు కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా తనకు తానుగా రాజీనామా చేయకుండా, అధిష్ఠానం తనను రాజీనామా చేయమని ఆదేశించలేని విధంగా పరిస్థితులు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి, రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా విభజన ప్రక్రియ పూర్తిచేయాలని కూడా కాంగ్రెస్ పెద్దలు ఒక దశలో ఆలోచించారు. అయితే సొంత పార్టీ ప్రభుత్వాన్ని విభజన కోసం రద్దు చేస్తే పార్లమెంట్‌లో ప్రతిపక్షాల సహకారం లభించకపోవచ్చునని భయపడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి విషయంలో ఏమి చేయాలో తెలియక, కాంగ్రెస్ పెద్దలు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ అధిష్ఠానం, ఇటు ముఖ్యమంత్రి పంతాలు, పట్టింపులకు పోవడం ర్రాష్టానికి మంచిది కాదు. కేంద్రం చేతిలో అధికారం ఉంది కనుక ఏదో ఒక విధంగా రాష్ట్ర విభజన జరపగలదు గానీ, తదనంతర పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? సీమాంధ్ర ప్రజల భవితకు స్పష్టమైన భరోసా ఇవ్వవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. విభజన వల్ల తమకు నష్టం జరుగుతుందని సీమాంధ్రులు భయపడుతున్నారు. ముఖ్యమంత్రి ప్రకటనలు, లేఖాస్త్రాలతో వారిలో నెలకొన్న భయాందోళనలు మరింత పెరుగుతున్నాయి. అవాంఛనీయ ప్రకటనలతో దిగ్విజయ్‌సింగ్ కూడా అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి తమిళనాడులో వలె మారబోతోంది అని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ఇటీవల ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.
పార్టీని కూడా బలి పెట్టుకునే విధంగా వ్యవహరించవలసిన అవసరం కాంగ్రెస్ పెద్దలకు ఏమి వచ్చిందో అంతుపట్టడం లేదు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఎలాగూ మట్టికొట్టుకుపోయింది. కనీసం అక్కడి ప్రజలను సంతృప్తిపరచడానికి నిర్దుష్ట ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. విభజన అంశాలను పరిశీలించి, పరిష్కారాలను సూచించడానికి ఏర్పాటైన మంత్రుల బృందం (జి.ఒ.ఎం.) ఇప్పటివరకూ రెండు పర్యాయాలు సమావేశమై మూడు గంటలపాటు చర్చలు సాగించింది. ఇందులో ఒక గంట పిచ్చాపాటికే సరిపోయింది. మహా అయితే ఇంకో రెండు పర్యాయాలు కలుస్తారు. అంటే మరో మూడు గంటలపాటు సమావేశమవుతారన్న మాట. అంటే ఇంత పెద్ద ర్రాష్టాన్ని విభజించడానికి, సమస్యల పరిష్కారానికి జి.ఒ.ఎం. కేటాయించబోయే సమయం అయిదారు గంటలేనన్న మాట. ఈ ధోరణే సీమాంధ్రులను రెచ్చగొడుతున్నది. ఆరు కోట్ల మంది మనోభావాలంటే అంత చులకనా? అని వారు అడుగుతున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించడం ఎంత ముఖ్యమో, సీమాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. కిరణ్ సర్కార్‌ను కొనసాగిస్తారా? రద్దు చేస్తారా? అన్నది ముఖ్యం కాదు.
సీమాంధ్రులకు భరోసా ఎలా కల్పించబోతున్నారన్నది ముఖ్యం. ఇప్పటివరకు ఏర్పాటుచేసిన ర్రాష్టాలకు భిన్నమైనది ఆంధ్రప్రదేశ్ విభజన. ఉదాహరణకు సీమాంధ్రకు రాజధాని ఎక్కడ ఏర్పాటుచేస్తారన్న విషయం తేల్చకుండా, మీరే నిర్ణయించుకోండి అంటే రాజధాని కోసం సీమాంధ్ర నాయకుల మధ్య తంపులు మొదలవుతాయి. గతంలో కర్నూలు రాజధానిగా ఉండేది కనుక ఇప్పుడు కూడా రాజధాని తమకే కావాలని రాయలసీమవాసులు పట్టుబట్టే అవకాశం ఉంది. కనుక కొత్త రాజధానితోపాటు మిగతా అన్ని అంశాలపై స్పష్టత ఇవ్వకుండా విభజన ప్రక్రియ పూర్తిచేయడం వాంఛనీయం కాదు. సీమాంధ్రకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామనీ, అందులో భాగంగా మంచి ప్యాకేజీ ఇస్తామనీ చెబుతున్న దిగ్విజయ్‌సింగ్, ఆ ప్యాకేజీ ఏమిటో గుట్టు విప్పితే బాగుంటుంది. కేంద్రం ప్రకటించబోయే ప్యాకేజీ సీమాంధ్రులకు సంతృప్తి కలిగించవచ్చు. ఒకవేళ సంతృప్తి చెందకపోతే తమకు ఇంకేమి కావాలో కోరే వెసులుబాటు సీమాంధ్రులకు కలుగుతుంది. రాష్ట్ర విభజన అర్థవంతంగా జరగాలి. కేంద్రం నిర్ణయం వల్ల తమకు నష్టం ఉండదన్న భావాన్ని ఆయా ప్రాంతాల ప్రజలలో కలిగించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాల కనీస బాధ్యత ఇది!

No comments:

Post a Comment