ఇటలీ సోనియా, తమిళనాడు చిదంబరం లకు మాపై అధికారం లేదు: బాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించిన
నిరవధిక నిరాహార దీక్ష ఈరోజు 3వ రోజుకు చేరింది. సీమాంధ్రలో స్వచ్ఛంద
ఉద్యమం మొదలై ఇప్పటికి 69 రోజులైందని, విద్యుత్, రవాణా, రైళ్లు, తాగునీరు,
ఆస్పత్రుల్లో అత్యవసర సేవలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, అయినా
ప్రభుత్వం ఏ మాత్రం చొరవ తీసుకోవటం లేదని చంద్రబాబు నాయుడు విమర్శించారు.
న్యూఢిల్లీ (న్యూస్ టీవీ ): అపీ భవన్
దీక్షలో బాబు మాట్లాడుతూ ” అన్ని రకాల వాదనలూ విన్న తర్వాతే తీర్పు
ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ మాత్రం తీర్పు ఇచ్చేసి వాదనలు
వినిపించమంటోంది. ఇది న్యాయమా అంటూ ” ప్రశ్నించారు . తన కొడుకు రాహుల్
ప్రధాని కావాలని సోనియా, తన కొడుకు జగన్ సీఎం కావాలని వైఎస్ విజయలక్ష్మి
లాలూచీ పడ్డారని, ఓట్లు, సీట్లు, పదవుల కోసం తెలుగు జాతికి అన్యాయం
చేశారని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని తీవ్రంగా విమర్శించారు. అలాగే..
తెలుగు ప్రజలకు న్యాయం జరగాలని ఏపీ భవన్‌లో దీక్ష చేస్తున్న తనకు అనుమతి
లేదంటూ ప్రభుత్వం ఆంక్షలు విధించటాన్ని బాబు తప్పుపట్టారు.
చట్టం, నిబంధనలకు విరుద్ధంగా జైల్లో జగన్
అక్రమ దీక్ష చేస్తే ప్రభుత్వం దానిని సక్రమం చేసిందని, ఆస్పత్రికి
తీసుకెళ్లి వైద్యం చేయించిందని నిందించారు. కానీ, తాను ప్రజల కోసం ఏపీ
భవన్‌లో దీక్ష చేస్తే మాత్రం బయటకు పొమ్మంటున్నారని.. ఇదంతా కుట్రలో భాగం
కాదా? అని ప్రశ్నించారు. “ఏపీ భవన్‌లో దీక్ష చేసేందుకు నాకు అర్హత లేదా?
సోనియాకు తెలుగు ప్రజలంటే అంత కోపం, అంత కక్ష ఎందుకు?” అని చంద్రబాబు
ప్రశ్నించారు.
తెలంగాణా ,సీమాంధ్ర ప్రాంతాల జేఏసీలు, భాగస్వామ్య పక్షాలతో చర్చించి
అందరికీ ఆమోదయోగ్యంగా సమస్యను పరిష్కరించాలని కేంద్రానికి చెప్పినా
పట్టించుకోలేదని నిందించారు. ప్రజల సమస్యల్ని పట్టించుకోని కాంగ్రెస్
పార్టీ.. వారి తరపున నిలబడ్డ టీడీపీని దెబ్బతీయాలని కుట్ర పన్నుతోందని
ధ్వజమెత్తారు. సమస్యను సానుకూలంగా పరిష్కరించే ప్రయత్నం చేయని దిగ్విజయ్..
టీడీపీపై బురద చల్లాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర
తగలబడుతోందని, అందుకే అందరికీ న్యాయం చేయాలంటూ టీడీపీ డిమాండ్ చేస్తోందని..
ఇందులో తప్పేంటని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెద్దమనుషులు ఉన్నారని,
రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, జేఏసీలు ఉన్నాయని, వారిని కూర్చోబెట్టి
సమస్యను పరిష్కరించకుండా.. ఇటలీకి చెందిన సోనియా, తమిళనాడుకు చెందిన
చిదంబరం, ఎన్నికల్లో గెలవలేని దిగ్విజయ్‌లకు రాష్ట్ర భవిష్యత్తును
నిర్ణయించే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు.
No comments:
Post a Comment